Aqua News

ముదురుతున్న ఎండలతో తగ్గుతున్న రొయ్యల సాగు..

Posted On July 1, 2016 at 6:16 pm by / No Comments

ఈ వేసవి కాలంలో రొయ్యల సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి ప్రధాన కారణం. వర్షాకాలంలో సాగుచేసిన రొయ్యల పంటను మూడు వంతుల రైతులు తీసేయగా, మిగతా రైతులు సైతం చెరువుల్లోని రొయ్యలను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటను సొమ్ము చేసుకున్న రైతులు.. వేసవికాలం సాగు వైపు మొగ్గుచూపారు. అయతే ఈ సంవత్సరం మాత్రం వేసవి కాలంలో రొయ్యల సాగు తగ్గనుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆక్వా సాగు సాధారణంగా ఐదు వేల హెక్టార్లలో ఉండగా, ఈ వేసవి కాలంలో మూడు వేల హెక్టార్లలోనే సాగుచేసే అవకాశాలున్నాయని జిల్లా మత్స్యశాఖాధికారి లక్ష్మీ నారాయణ తెలిపారు.

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటి శాతం పెరిగి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి, దీంతో రైతులు ఆచితూచి పంటను సాగుచేయాలనుకుంటున్నారు. గత సంవత్సరంతోపాటు ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలకు అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ముదిరిన ఎండలు రొయ్యల సాగుకు ఏమాత్రం అనువు కాదని రైతులు భావిస్తున్నారు. చివరకు సముద్రపు క్రీకుల్లో సైతం ఉప్పునీటి శాతం పెరిగిపోయే అవకాశం ఉండటంతో రైతులు సాగుకు వెనుకడుగేస్తున్నారు. అయతే కొంతమంది రైతులు మాత్రం ప్రస్తుతం ఉన్న ధరలను చూసి సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురిస్తే దిగుబడులు పెరిగే అవకాశం ఉండటంతో వారు సాగుకు మొగ్గు చూపుతుండగా, మెజారిటీ రైతులు మాత్రం సాగుకు దూరంగానే ఉండాలని భావిస్తున్నారు.
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యలకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు వేసవికాలం కాకపోయినా వర్షాకాలంలోనైనా సాగు చేసేందుకు ముందుగానే కౌలుకు చెరువులను తీసుకుంటున్నారు. గతంలో హెక్టారు పదివేల రూపాయలకు కూడా అడగని కౌలుదారులు నేడు 50 వేల రూపాయలకు పైగానే అడుగుతుండటంతో రొయ్యల చెరువులు సాగు చేయనివారు కౌలుకు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *