Aqua News

దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని ప్రధాని మోదీ పిలుపు

Posted On July 2, 2016 at 7:48 pm by / 1 Comment

దేశవ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులకు చాలా గిరాకీ ఉందని, సేంద్రీయ సాగుతో రైతులకు, దేశానికి ప్రయోజనకరమని  ప్రధాని మోదీ  చెప్పారు. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రధాని సోమవారం ప్రసంగించారు. భారత వ్యవసాయ రంగాన్ని మార్చడమెలాగో అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో చర్చించడానికి తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. ‘‘రైతులు, వ్యవసాయం, గ్రామాలను వేర్వేరు అంశాలుగా మనం చూస్తే దేశానికి ప్రయోజనం సిద్ధించదు. వ్యవసాయాన్ని సమగ్రంగా చూడాలి.’’ అని ప్రధాని స్పష్టం చేశారు. అనూహ్య వాతావరణ పరిస్థితులతో నష్టపోతున్న రైతులు ఆర్థిక భద్రత కోసం వ్యవసాయ కార్యకలాపాలను మూడుగా విభజించుకోవాలని సూచించారు. సాధారణ పంట సాగు, ఆర్థిక విలువను చేకూర్చే కలప కోసం చెట్లపెంపు, పశుపోషణ చేపట్టాలన్నారు. కలప, పశుపోషణ ఉత్పత్తులు రైతులు నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకోకుండా చేస్తాయని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద సౌరపలకాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్తును విక్రయించుకుని అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చన్నారు. పండ్లు వృథా అయ్యే సమస్య పరిష్కారానికిగాను శీతల పానీయాల్లో 5శాతం పండ్ల రసాన్ని కలపాలని శీతలపానీయాల కంపెనీలకు తాను సూచించినట్లు ప్రధాని చెప్పారు. ఫలితంగా రైతులు ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉంటారన్నారు. రైతుల ప్రయోజనం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, కిసాన్‌ మొబైల్‌ ఫోన్‌ రావాల్సిన అవసరం ఉందని ప్రధానిచెప్పారు. ఇటువంటి యాప్‌ను అభివృద్ధి చేయాలని, దీనికి పెద్దఎత్తున మార్కెట్‌ ఉంటుందని అంకుర పారిశ్రామికవేత్తలకు సూచించారు. వ్యవసాయోత్పత్తులకు మెరుగైన ధర రావడానికి మండీలను ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానించాలన్న ప్రభుత్వ ప్రణాళిక గురించి చెప్పారు. వ్యవసాయ రంగంలోవిజయ గాథలను ప్రముఖంగా ప్రచారం చేయడానికి డిజిటల్‌ ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటు చేయాలన్నారు.

• తొలి సేంద్రీయ రాష్ట్రంగా సిక్కిం:

పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే సిక్కిం అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. సేంద్రీయ సాగులో సిక్కిం విజయగాథను ప్రధాని ప్రస్తావిస్తూ దేశంలోనే తొలి సేంద్రీయ రాష్ట్రంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి పవన్‌ చామ్లింగ్‌కు సేంద్రీయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. రాష్ట్రానికి నేపాలీలో అభినందనలు తెలియజేశారు. సిక్కింను సుఖిస్థాన్‌ (సుఖవంతమైన ప్రాంతం)గా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాలూ సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని సూచించారు. ‘‘100 నుంచి 150 గ్రామాలుండే తాలూకా లేదా బ్లాక్‌ లేదా జిల్లాను ఎంచుకుని సేంద్రీయ వ్యవసాయం కోసం ప్రయత్నించండి. ఈ ప్రయోగం విజయవంతమయితే ఇతర ప్రాంతాల్లోని రైతులు కూడా ఈ పద్ధతిని సొంతంగానే అనుసరిస్తారు. శాస్త్రవేత్తలు ఎన్ని ఉపన్యాసాలిచ్చినా రైతులు ప్రభావితం కాకపోవచ్చు. ప్రత్యక్షంగా చూసిన దానిని విశ్వసిస్తారు.’’ అని చెప్పారు. ప్రారంభంలో ఈ ఆలోచనకు వ్యతిరేకత ఎదురయినా నిరాశ చెందవద్దని, చివరకు విజయం తథ్యమని చెప్పారు. గత ప్రభుత్వాలను మోదీ విమర్శిస్తూ వ్యవసాయ సంబంధిత అంశాలను దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో చర్చించేవారని, అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులూ అక్కడికే వచ్చేవారని చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో సమస్యలపై చర్చించడానికి తొలిసారి వ్యవసాయ మంత్రులు రెండు రోజులు ఈ సదస్సులో పాల్గొంటున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన అభివృద్ధిని ఉపయోగించుకోవడం ద్వారా స్వల్పకాలిక, దీర్ఘ కాలిక పరిష్కారాల కోసం చూస్తున్నారు.’’ అని చెప్పారు. ఈ సదస్సు ఫలితాలు బడ్జెట్లలో, రాష్ట్రాల వ్యవసాయాభివృద్ధి మార్గసూచీలో, కేంద్రం దార్శనికతలో ప్రతిఫలిస్తాయని తెలిపారు. ఇటీవల ప్రకటించిన పంట బీమా పథకంతో రైతులకు ఏ విధంగా ప్రయోజనం చేకూరేదీ వివరించారు.

One thought on “దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని ప్రధాని మోదీ పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *